19, ఏప్రిల్ 2014, శనివారం

గంగా నది నుండి థేమ్స్ వరకు ... వారణాసి , లండన్ ప్రయాణ జ్ఞాపకాలు

 ఇది చాలా రోజుల నుండి వాయిదా వేసుకుంటూ వస్తున్న టపా. ఒక సంవత్సర వ్యవధిలో నేను చూసిన రెండు మహానగరాలకు వెళ్ళినప్పటి నా అనుభవాలే ఈ పోస్ట్.ఓక నగరం చరిత్రకందని కాలం నుండి మహాశివుడు నడిచిన ప్రదేశమైతే , మరొక నగరం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పబడిన ఇంగ్లీష్ పాలకుల ముఖ్య పట్టణం. డిసెంబర్ లోనే వ్రాద్దమనుకుని పని వొత్తిడి వల్ల రాయలేకపోయాను. నా పనిలో భాగంగా అప్పుడప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, నేను చేస్తున్న పనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.ఫనిలో భాగంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ,జీవితాంతం దాచుకోగలిగిన జ్ఞాపకాలు మిగులుతాయి. కాని నేను లండన్ నగరంలో కాలు పెట్టినప్పటినుండి ఒక చిన్న బాధ , పిల్లలకు దూరంగా వెళ్ళటం వల్లనేమో అనుకున్నాను , కానీ కారణం అది కాదు అని తరువాత తెలుసుకోగలిగాను. ఆది ఏంటో కాసేపట్లో మీకు చెప్తాను.


కాశీ యాత్ర - మా  కంపనీలో freshers ని కేవలం IIT ల నుంచి మాత్రమే తీసుకుంటాం, ఈ recruitment లో భాగంగా ఎవరెవరు ఏయే campus వెళతారో చెప్పండని నా టీం ని అడుగుతూ, నేను బనారస్ హిందూ యూనివర్సిటీ కి వెళతాను అని చెప్పాను. వాళ్ళు నా విన్నపాన్ని సహృదయంతో మన్నించారు :-), వారణాసి  శివుడు నడిచిన ప్రదేశం, ఎవరైనా అక్కడికి భగవంతున్ని దర్శించుకోవడనికే వెళతారు. కానీ నేను బనారస్ వెళ్ళడానికి ప్రధాన కారణం పాలనురుగలతో పరవళ్ళు తొక్కే గంగా నదిని చూడాలనుకోవడం. నాకు దేవుడుపై భక్తీ వుందో లేడో నేనప్పటికి చెప్పలేనోమో , అవసరం వున్నప్పుడు మాత్రమే  దేవుడికి దండం పెట్టె వాళ్లల్లో నేను  వుంటాను . దేవుడికి లంచాల ఆశ చూపే వాణ్ణి మాత్రం కాదు  . అది వొక కారణమైతే , మరోటి నదుల ఫై నాకున్న ఆసక్తి మరొక ప్రముఖ కారణం. ప్రపంచంలో ఏ నదిఅయిన మానవ వికాసానికి పునాదులు.  నైలు,గంగా -సింధు  నదులు దీనికి నేడున్న సజీవ సాక్ష్యాలు. కాశీ కి హైదరాబాద్ నుండి ఫ్లైట్ లేదు కాబట్టి, నేను, ఇంకా మరిద్దరు colleagues తో ఢిల్లీ వెళ్లి అక్కడినుండి connecting ఫ్లైట్ లో వరనస్సి వెళ్ళాము . హోటల్ లో దిగిన క్షణం నుండి ఒకటే ఆలోచన , తొందరగా గంగ నది తీరానికి వెళ్ళాలి ... మిగతా పనులు తర్వాత చూసుకోవచ్చని. ఎలాగు కాంపస్ కి రేపొద్దున వెళ్ళాలి, అక్కడ ఇక్కడ షాపింగ్ చేసే బదులు , గంగలో స్నానం చేసి, విశ్వనాథున్ని దర్శించుకోవటం మేలని నా ఫ్రండ్స్ ని convince చేసి ఒక కాబ్ మాట్లాడుకొని బయలుదేరాము, ఒక 20 నిమిషాల తరవాత కార్ డ్రైవర్ "ఆగాయ సాబ్" అని చెప్పగానే ఒక్కసారిగా కొంత ఉద్వేగం , మాలో ఎవరం ఇంతవరకు వారాణసికి ఎవరం రాలేదు - అందుకనే అంత ఆత్రుత.ఓక రెండు  నిముషాలు నడిచేసరికి గంగా నది కన్పించింది , ఎక్కడ చూసిన వివిధ దేశాల నుండి వచ్చిన ప్రజలే , విచిత్రం ఏంటంటే  అందులో చాల తక్కువమంది వృద్దులు. ఏవైనా ఖరీదైనా  వస్తువులు వుంటే మీతోనే ఉంచుకోండి సార్ ఎవరిని నమ్మవద్దు, నేను  మళ్లి హారతి సమయానికి వస్తాను అని మా కాబ్ డ్రైవర్ చెపుతూ వుంటే , హారతి సమయం ఎప్ప్దుడు అని అడిగాం.  సాయంత్రం 6 గంటలకు మొదలుహత  అవుంతుంది అని చెప్పగానే " మేము అంతసేపు ఇక్కడ ఎం చేయాలి, అని ఆలోచిస్తుండగా మళ్లి  తానే చెప్పాడు , హారతి ప్రక్రియ చాల బాగుంటుంది సార్ , ఇప్పుడు జనం అంతగా లేరని అనిపించే ఈ ఘాట్ లన్ని 10 నిమిషాల్లో వేలమందితో నిండిపోతాయి అని చెప్పుకొచ్చాడు .సరే చూద్దాం హోటల్ కి వెళ్లి చేసేది కూడా ఏమి లేదు అని ఒక  ఘాట్ వైపు నడిచాం . 


దగ్గరికి వెళ్ళగానే .. నా అంచనాలు అన్ని తారుమారయ్యాయి , ఆకు పచ్చగా నీరు , ఎక్కడ చూసిన పాన్ నమిలి ఊసినా మరకలు , చిన్న దుర్గంధం . అది చూడగానే ఎవరో ముఖం మీద గట్టిగా గుద్దిన feeling. ఇక వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నా సమయంలో అక్కడ పడవ నడిపే వ్యక్తీ "సార్ ఇక్కడ నీళ్ళు ఇలాగె వుంటాయి నది మధ్యలోకి వెళితే చాల బాగుంటాయని" చెప్పగానే , సరే అని పడవ  ఎక్కాం , కాని అంతట అదే పరిస్థితి. చేసేదేం లేక కాసేపు అలాగే పడవలో తిరిగి నది అవతలి ఒడ్డు కి స్నానానికని వెళ్ళాం, కాని పరిస్థిలో మార్పు లేదు. నా colleagues స్నానం చేసారుగాని, నాకెందుకో చేయాలనీ పించలేదు , అలాగే నేను పడవలో వుండి  పోయాను.అంత దూరం వెళ్లి గంగ నదిలో స్నానం చేయని వారు వుండరేమో , కాని నాకెందుకో తప్పు అనిపించలేదు. నీళ్ళు ఎంత బాగా లేకున్నా భక్తితో మునక వేయడం ఒక మనదేశంలోనే సాధ్యమేమో , ఆరోగ్యకరం కాదు అని తెలిసినా పుష్కరాలకు వెళ్లి జ్వరాలు తెచ్చుకోవటం ఎందుకో నాకిప్పటికి అర్థం కాదు లాంటి ఆలోచనలు నా మనసులో వస్తుండగానే ... . సిగరెట్లు కాలుస్తాను , మాంసం తింటాను , ఇంతవరకు జీవితం లో పూర్తిగా ఈ రామయనమో , గీతానో చదివినవాడిని కాను , ఈ నమ్మకాలను  విమర్చించే అర్హత నాకెక్కడిది అని నా మెదడుని మూసివేసి , ఇవతల  వొడ్డుకి చేరుకున్నాను. 



at Saranath
సాయంత్రం 5 గంటలు కాగానే మా కాబ్ డ్రైవర్ చెప్పినట్టుగానే జనం రాక  మొదలయ్యింది, కొంత్సేపట్లోనే ఆ ఘాట్ మొత్తం జనంతో  నిండి పోయింది , భజన గీతాలు మొదలు పెట్టారు , హారతిని దగ్గరగా చూడటం కోసం కొందరు డబ్బులిచ్చి పడవల్లో కూచున్నారు . ఎక్కడ చూసిన దీపాలు , 5గురు  యువకులు తీరం పక్కనే చేసిన సిమెంట్ గద్దెలపై పెద్ద హరతులతో సిద్దంగా వున్నారు, ఇంకా కొన్ని నిమిషాల్లోనే హారతి ప్రారంభం అయ్యింది , దాదాపు ఒక అరగంట  పాటు మంత్రాలు, భక్తీ గీతాలతో తీరం హోరెత్తింది , ఒక్కరు కూడా హారతి అయ్యే వరకు అక్కడినుడి కదిలినట్టు నేను చూడలేదు . హారతి చుసిన తర్వాత అప్పటివరకు నా మనసును తొలుస్తున్న బాధంత మాయం . గంగా హరతి  ఒక అద్భుతం.  కాంపస్ రిక్రూట్మెంట్ అయిన మరుసటి రోజు సారనాథ్ వెళ్ళాము. సారనాథ్ స్తూపం, ముసెఅమ్ చూసి , తిరిగు పయనం అయ్యాం . 

లండన్ ప్రయాణం : గత డిసెంబర్ లో strategy meeting కోసమని లండన్ వెళ్ళాను, నాకది మొదటి విదేశీ ప్రయాణం , పైగా డిసెంబర్ లో లండన్ వెళ్ళవలసి రావటంతో ,లండన్ లో వుండే నా స్నేహితులు నన్ను చలి పేరు చెప్పి చాల భయపెట్టారు , ఎందుకైనా మచిదని 10 degree కన్నా తక్కువ temparature కోసమని షాపింగ్ చెసాను. హైదరాబాద్ నుండి పొద్దున్న 4 గంటలకి ఫ్లైట్ , నేను నిద్రపోలేదు ఇంట్లో ఎవరు నిద్రపోలేదు .... Airport అవరకు వచ్చి sendoff ఇస్తానని మా శ్రీమతి అంటే , ఎందుకు అంత రాత్రి పిల్లలను ఇబ్బంది పెట్టడం అని సున్నితంగా వద్దని చెప్పాను . హైదరాబాద్ నుండి దుబాయ్ అక్కడినుండి లండన్ - 12 గంటల ప్రయాణం. 


Airport నుండి బయటకు వెళ్ళగానే వీరీతమైన చలి, తొందరగా బాగ్ ఓపెన్ చేసి coat , gloves వేసుకున్నాను . రెడ్ను నిమిషాల్లో ఒక కాబ్ లోకేల్లి కూర్చోగానే కాస్త releif. St.pauls కి వెళ్లాలి ఎంతవుతుంది అని కాబ్ డ్రైవర్ ని అడిగాను , 80 పౌండ్స్ అన్నాడు .  తల తిరిగిపోయింది , గట్టిగ అరిచి నీకు పిచ్హా అని తిట్టలన్నంత కోపం, 30 నిమిషాల ప్రయాణానికి 8000 వేల రూపాయల? అని, కాని నేను చేసే లెక్క తప్పని , pounds ని రూపీస్ లోకి convert చేసి చూస్తే నేను అక్కడ కనీసం కాఫి కూడా తాగాలేనని గుర్తుకువచ్చి స్థిమిత పడ్డాను . హోటల్ లోకి వెళ్లి స్నానం చేసి , కాస్తా ఏమైనా తిందామని మెనూ చుసాను. రైస్ తో వున్నా ఐటమ్స్ ఏమి లేకపోవడంతో ఒక శాండ్విచ్ తిని పడుకున్దిపోయాను. 


తెల్లారి రెడీ అయ్యి, శాండ్విచ్ మల్లి తినే ఓపిక లేక ఒక ఆమ్లెట్ తిని, కొన్ని పాలు తాగి  ఆఫీసు కి బయలు దేరాను,

at St.Pauls
హోటల్ నుండి బయటకు రాగానే మళ్లీ  అదే చలి , చల్లని నీళ్ళు ఎవరో మీద పోసిన ఫీలింగ్ , గ్లోవ్స్ వేసుకున్నా, వెల్లకి చలి తాకుతూనే వుంది, హోటల్ నుండి మా ఆఫీసు కేవలం 2 నిమిషాల నడక కావడంతో పెద్దగ ఇబ్బంది అనిపించలేదు. కాని రోజు పొద్దున్న నడుస్తున్నప్పుడు  కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు చూసాను . అంత చలిలో కేవలం T -shirt , షార్ట్స్ లో కొందరు జాగింగ్ చేస్తుండగా, స్కూల్ కి వెళ్ళే పిల్లలు  కేవలం sweater తప్ప గ్లోవ్స్ గాని ఇంకా ఏ వింటర్ protection లేకుండా నడుస్తున్నారు. ట్రాఫిక్ వున్నా లేకున్నా ఎవరు సిగ్నల్స్ ని  బ్రేక్ చేయడం చూడలేదు. రోజు పొద్దున్నమంచి breakfast, లంచ్ కి వైన్ తో sandwiches , డిన్నర్ కి ఏదైనా ఇండియన్ ఫుడ్ బయటికి వెళ్లి తినడం , పిల్లలని మిస్ అవుతున్నానన బాధ తప్ప మిగతాదంతా బాగానే ఎంజాయ్ చేశాను . 

నా తిరుగు ప్రయాణం సండే కావటం తో , Saturday రోజు అక్కడవుందే నా తెలుగు colleague తో లండన్ పాస్ తీసుకుని , లండన్ బ్రిడ్జి , వాటేర్లూ , శేక్స్పయార్ గ్లోబ్ , లండన్ museum చూసాం , లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ వెళ్ళటం  కుదరలేదు . ఎక్కడికి వెళ్ళిన, ఎం చెసినా ఏదో ఒక చిన్న బాధ , బాధ అనటం కన్నా , ఒక "disturbing thought " అంటే సమంజసమంగా వుంటుంది . లండన్ museum లో మొఘల్ చక్రవర్తులకు సంబందించిన కొన్ని వస్తువులు , కోహీనూర్ వజ్రం చూసిన తర్వాత అర్థం అయ్యింది నన్ను బాధిస్తున్న ఆలోచన . 


నేనెక్కడున్నాను ? అ ఒక యాభై , అరవై సంవత్సరాల క్రితం వరకు , నా దేశాన్ని దోచుకు తిన్న మరో దేశంలో, వేలాది నా దేశ ప్రజల ప్రాణాలను తీసుకున్న కిరాతక సామ్రాజ్యపు రాజధానిలో, వేల కట్టలేని సంపదనంతా మనకు కాకుండా చేసిన దోపిడిదారుల దేశంలో, ఈ కనిపిస్తున్న ప్రతి కట్టడం వెనుక ఎదో ఒక దేశపు మౌన రోదన ఉండే ఉంటుంది . St.pauls లో వున్నా ఆ జీసస్ కు తెలుసా? తనకు కట్టిన ఈ దేవాలయం గోడలపై భారత వీరుడు భగత్ సింగ్ రక్తపు మరకలు వున్నాయని ? పరిపాలన పేరుతో వీళ్ళ పూర్వికులు సాగించిన కిరాతకాల గురుంచి ఈ ప్రజలకు తెలుసా? వీళ్ళు చారిత్రిక ప్రదేశాలని చెప్పుకుంటున్న ఇవన్నీ, ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ దేశం చేసిన మరణహోమాలకు మౌన సాక్ష్యాలని ఏనాడైనా అనుకుంటారా ?


థేమ్స్ నది నా కళ్ళకు రక్తపు మడుగుల కనిపించింది  , ఆ ప్రవాహ రొదలో నా ముందు తరాల వారు , జలియన్వలభాగ్ లో చేసిన ఆర్తనాదాలు వినిపించాయి. థేమ్స్ నది నాకప్పుడు , ప్రపంచ వ్యాప్తంగా జరిగిన దోపిడీ జ్ఞాపకాలు మౌనంగా  మోస్తున్నట్టు కనిపించింది . గంగ నది మురికిగా అనుపించవచ్చు ,  కాని ఆ నీటిలో దోపిడీ జ్ఞాపకాలు   లేవు ,  నాగరికతల విధ్వంసపు ఆనవాళ్ళు లేని గంగా నది పవిత్రం కాక మరేమవుతుంది.  ఆ నీళ్ళల్లో లోకా సమస్తా సుఖినోభవంతు అనే వేద ఘోష వుంది 

6 కామెంట్‌లు:

  1. గంగా నది పై మీకు కలిగిన ఆవేదనలో అర్ధం ఉన్నది.మీ బ్లాగు బాగుంది.అభినందనలు...!

    రిప్లయితొలగించండి
  2. మీ టపా చాలా అర్ధవంతంగా ఉంది.. కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  3. Excellent narration. London velli yedadiki kuda tirakkundaa muppavu British laa behave chese tappadu manushulaki chempa pettu laa undi mee bhavana. I like it.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృతజ్ఞతలు స్వర్ణమల్లిక గారు , మీ బ్లాగు చాలా బాగుంది

      తొలగించండి