1, మే 2022, ఆదివారం

మనిషి, రూపాయి

June, 16-2020 


మనిషిని రూపాయల్లో కొలిచి, 

మనకోసం ఏమైనా  చేస్తాడ  , చేయగలడా  అన్న కోణంలో లెక్కించి, 

వాడు దాటిన కృషివంతెనలని తక్కువచేసి, 

కాస్త మెదడుని ఉపయోగించి మాట్లాడితే పొగరని, 

నిజాలు చెప్తే రెనాగేడ్ అని నిందలు వేస్తే 

ఏం చేయాలి వాడు ?

ఒళ్ళంతా నిప్పులు  కుమ్మరించుకోవాలా ? 

కోట్ల లీటర్ల ఉమ్మును మీపై దుమ్మెత్తిపోయాలా ?


ఇంకెంతమంది ప్రాణాలు బలై పోవాలి మీ పైశాశికత్వానికి?

ఎన్ని  కిలోమీటర్ల  లోతుల్లో పాతిపెట్టాలి మీ శరీరాల్ని ?

ప్రపంచం మా చుట్టే తిరుగుతుందని , కొమ్ములున్న గుర్రం మా ఇంట్లో ఉందని , 

కార్లు, బార్లు, పైరవీల కలయికతో నిలుపుకున్న జీవితాలు మీవి ....... 


మీరు  పడింది కష్టం అంటే చప్పట్లు కొట్టాలా ?


- Saral

ఆత్మవంచన

June, 20, 2020 


ఎవరి జ్ఞాపకాలు అవి ? దోసిళ్ళలో మోస్తున్నావ్... ?

నువ్వు ఆస్వాదించని అనుభవాల్ని ఎందుకు ముఖానికి పూసుకుంటున్నావ్?

నీదంటూ ఒక్క అడుగు కూడా లేని ప్రయాణాల్ని నీవిగా ఎందుకు చెప్తున్నావ్?

ఎందుకు అబద్దాల అద్దాల్లో నీ ప్రతిబింబాన్ని వెతుకుతున్నావ్? 


మనమంతా గొంగళిపురుగులమే అని తెలియని సీతాకోకచిలుకలున్నాయా? 

మరెందుకు గతాన్ని పాపంలా చూస్తున్నావ్?

ఇంకెతకాలం మోసాల అత్తర్లు  రాసుకుంటావ్ ? 


నువ్వు కట్టుకుంటున్న అరలు అనంతమైన చీకటిలోకి జారుకుంటాయి , 

చిన్న గుడ్డిదీపం కోసం నువ్వు పిచ్చి కేకలు వేసే రోజు వస్తుంది ! 


అబద్దాలు చెప్పటం ఒక కళ అని, 

మోసం చెయ్యటం కూడా నైపుణ్యమని , 

సంపదే అసలైన  నిజమని నమ్మిన మనుషుల్లో కొంతమంది 

ఇప్పటికే స్మశానంలో శాశ్వత విశ్రాంతిలో వున్నారు , 

రంగులు వెలిసిన ఆ సమాధులను చూస్తే 

సత్యం తెలుస్తుంది !  - Ramesh Saral

నువ్వనే నేను


గుర్తుకు వచ్చానా అని అడుగుతావ్ ఎంటి? 

వెన్నెల వెలుగులో చెట్టు నీడ కూడా నీలా కనిపిస్తుంటే 

ఎక్కడున్నావ్ అంటావ్ ఎంటి ? 

నువ్వు పెట్టుకున్న మల్లెల్లో మగత నిద్రలో వుంటే 

మెరిసిపోతూన్నావ్ అంటావెంటి?

నీ కన్నుల వెన్నెల్లో తడిసిపోతుంటే 

నా గుండెల్లో నీ పాదముద్రలు 

నా కన్నుల్లో నీ ప్రతిబింబాలు 

నా గొంతులో నీ మాటలు 

నీ ప్రేమకు శతాబ్దాల బానిసను


- రమేష్ సరల్

ఆయుధాల ఆకలి


ఆయుధాలకు ఆకలి నేర్పిన రాక్షసత్వం 

పసిపిల్లల శవాలను పేరుస్తోంది 


కడుపులో బిడ్డ కోసం కోటి కలలను కంటున్న  

కాబోయే తల్లిని ఒక్క బుల్లెట్ బూడిద చేసింది 


ఏ మానవ విలువల కోసం ఈ యుద్ధం అని ప్రశ్నించలేని   మరమనుషులు సైనికులు 

శవ కారాగారాలను అవిశ్రాంతంగా నడిపిస్తున్నారు 


పెట్రోల్ పై ఆధిపత్యం కోసం రక్తటేరులు పారించిన రాక్షసులు 

అధికారం కోసం సుందర వనాలను శ్మశానాలు చేసిన దైత్యులు 

హిట్లర్ నుండి "ఇడీ అమీన్" వరకు ఏ రాబందైనా 

ఓ రోజు నేల కులాల్సిందే 


నిమిషాల్లో మాయమైన కోట్లప్రజలు 

చరిత్ర పుస్తకాల్లో ఒక చిన్న పాఠ్యంశంగా చేర్చబడటమే అసలు విషాదం 

- రమేష్ సరళ్

జ్ఞాపకాల మరకలు

మార్చ్ 13, 22

గాయం కన్నా అది మిగిల్చిన మరకలు ఎక్కువ సార్లు బాధిస్తాయి 

జ్ఞాపకాలు రాలిపోయిన ఆకులు కావు  మట్టిలో కరిగిపోవడానికి 

 బాధించిన ప్రతి నిమిషం గుండెపై ముళ్ళ కంచె అవుతుంది


సంతోషం , సరదా ఇలా ఎన్ని రంగులు ముఖంపై పోసుకున్నా

నీ మనసు నుండి నువ్వు ఎక్కడికి పారిపోగలవు ?


వెలుతురు ఆస్వాదించే లోపే చీకటి కమ్మేసే  లోకంలో 

ఆది అంతం లేని నిశీధిలో నువ్వొక లెక్కకు కూడా రాని ఇసుక రేణువు ,

విషాదాలు మోసే యంత్రానివి   


కోట్ల సంవత్సరాలనుంచి అలసట లేకుండా తిరుగుతున్న అనంత నీటి గోళానికి  

నీ కన్నీళ్లతో  పనేంటి?


ప్రతినిమిషం ఓ నక్షత్రాన్ని మింగేస్తున్న విశ్వానికి, 

గంటల్లో లక్షల ప్రాణాలను పాతరేసిన సునామీలను పుట్టించే మట్టిముద్దకి. 

ఏ విలువలు నేర్పుతావ్?


డబ్బు కోసం మురికి తింటున్న జీవచ్ఛవాల మధ్య 

మానవత్వం క్షణాల్లో ఆవిరయ్యే అత్తరు 

- రమేష్ సరళ్